ఆడామగ అనే తేడా లేకుండా.. అందరూ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకునేది కురుల సంరక్షణ విషయంలోనే. జుట్టు రాలిపోకుండా ఉండటానికి, ఒత్తుగా మారడానికి రకరకాల చిట్కాలను పాటిస్తుంటాం. మన తలపై ఉన్న వెంట్రుకలు నిరంతరం పెరుగుతూనే ఉంటాయి. నెలకు దాదాపుగా అరంగుళం మేర ఈ పెరుగుదల ఉంటుంది. అంటే ఏడాదికి ఆరంగుళాల మేర ఎదుగుతుంది. ఈ విషయాన్ని అమెరికన్ అకాడమీ ఆప్ డెర్మటాలజీ స్పష్టం చేస్తుంది. అలా అయితే మన జడ ఏడాదికి ఆరంగుళాల మేర పెరగాలి. కానీ ఎందుకు పెరగడం లేదు. దాన్ని ప్రభావితం చేస్తున్న అంశాలేంటి? జుట్టు పెరగాలంటే ఏం చేయాలి? తెలుసుకుందాం.
Hair Fall Control and Regrowth Tips in Telugu
కురుల పెరుగుదలను ప్రత్యక్షంగా, పరోక్షంగా కొన్ని విషయాలు ప్రభావితం చేస్తుంటాయి. అందులో ప్రధానమైనవి
• వయసు
• ఆరోగ్యం
• జుట్టు తత్వం
• జన్యుపరమైన కారణాలు
• హార్మోన్ల ప్రభావం
• పోషకాహారం తీసుకోకపోవడం
• ఒత్తిడి
• కాలుష్యం
మరి వెంట్రుకలు పెరిగేలా చేయడం ఎలా?
సాధారణంగా జుట్టు ఎదగడానికి రకరకాల చిట్కాలు పాటిస్తూ ఉంటారు. వాటి వల్ల ఒక్కసారిగా కురులు ఒత్తుగా, పొడవుగా అయిపోతాయనుకుంటే పొరపాటే. దానికోసం మనం కొన్ని ఆరోగ్యకరమైన పద్ధతులు పాటించాల్సి ఉంటుంది.
కొన్ని సహజమైన చిట్కాలు పాటించడం ద్వారా జుట్టు పొడవయ్యేలా చూసుకోవచ్చు.
• ఉల్లిపాయను మెత్తగా గ్రైండ్ చేసి రసం తీసుకోవాలి. ఆ రసాన్ని మాడుకు బాగా పట్టించాలి. 10-15 నిముషాల తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ జుట్టు పెరిగేలా చేస్తుంది.
• పావు కప్పు మెంతులను నీటిలో నానబెట్టాలి. బాగా నానిన తర్వాత వాటిని మెత్తగా నూరి కొంచెం పాలు కలపాలి. ఈ మిశ్రమాన్ని స్కాల్ఫ్ కి పట్టించి అరగంట తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి.
• ఉసిరిలో ఉండే విటమిన్ సి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. రెండు స్పూన్ల ఉసిరి పొడిలో సమాన పరిమాణంలో నిమ్మరసాన్ని కలిపి స్కాల్ఫ్ కి అప్లై చేసుకోవాలి. బాగా ఆరిన తర్వాత గోరువెచ్చటి నీటితో తలను శుభ్రం చేసుకోవాలి.
• కురుల సంరక్షణ విషయంలో మందార ఆకులు, పూలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇవి జుట్టు రాలడాన్ని తగ్గించి పొడవుగా పెరిగేలా చేస్తాయి. దీనికోసం మందార పూలు, ఆకులను మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీనికి కొద్దిగా కొబ్బరి నూనె కలిపి తలకు బాగా పట్టించాలి. గంట తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. వారానికోసారి ఈ చిట్కాను పాటించడం ద్వారా మంచి ఫలితం పొందొచ్చు.
• ఎస్సెన్సియల్ నూనెలు ఉపయోగించడం ద్వారా జుట్టు ఎదిగేలా చేసుకోవచ్చు. రోజ్ మేరీ, జొజోబా, టీట్రీ, పెప్పర్మింట్ తదితర నూనెలను ఎస్సెన్సియల్ నూనెలు అని పిలుస్తారు. అయితే వీటిని నేరుగా వెంట్రుకలకు రాసుకోకూడదు. కొన్ని చుక్కలు కొబ్బరినూనెలో కలిపి రాసుకోవాల్సి ఉంటుంది.
• తలస్నానానికి ఒక పది నిమిషాల ముందు కురులకు, స్కాల్ఫ్ కి గోరు వెచ్చని కొబ్బరి నూనెతో మర్దన చేసుకోవాలి.
పోషకాహారం
మనం ఎన్ని రకాల చిట్కాలు పాటించినప్పటకీ.. ఆహారంలో జుట్టుకి అవసరమైన పోషకాలు అందేలా చూసుకోవడం ద్వారా ఎక్కువ ప్రయోజనం పొందవచ్చు.
• సముద్రపు చేపలు తినడం ద్వారా ఒమెగా 3, ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్స్ మన శరీరానికి అందుతాయి. ఈ రెండు ఫ్యాటీ యాసిడ్స్ జుట్టు పెరిగేలా చేస్తాయి. మాంసాహారం తినని వారు అవిశె గింజలు తినడం ద్వారా ప్రయోజనం పొందవచ్చు.
• బెర్రీ, సిట్రస్ జాతి పండ్లలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. విటమిన్ సి జుట్టు ఎదగడానికి సహకరిస్తుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది. కాబట్టి వీటిని మీ డైట్ లో చేర్చుకోండి.
• పాలకూరలో విటమిన్ ఎ, సి, ఐరన్ ఉంటాయి. వెంట్రుకలు ఆరోగ్యంగా ఉండటానికి ఇవి చాలా అవసరం.
• పెరుగులో ప్రొబయాటిక్స్ అధికంగా ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలకు అత్యావశ్యకమైనవి. అందుకే రోజుకి ఒక కప్పు పెరుగు కచ్చితంగా తినాలి.
పరిశోధనలు చెప్తున్న దాని ప్రకారం వెంట్రుకల పెరుగుదలకు అతి ముఖ్యమయినది బయోటిన్ దీన్ని విటమిన్ బి అని కూడా అంటారు ఇది ఎక్కువగా తృణధాన్యాలు ,ఆకుకూరలు మరియు సముద్రపు ఆహారం లో ఎక్కువగా ఉంటుంది .
• కెఫీన్ కూడా జుట్టు పెరిగేలా చేస్తుంది. రోజుకో కప్పు కాఫీ తాగడం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గడంతో పాటు వెంట్రుకలు కూడా పెరుగుతాయి.
• గ్రీన్ టీలో ఉండే పాలీఫెనాల్స్ కురుల పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. కాబట్టి రోజుకి 1-2 సార్లు గ్రీన్ టీ తాగడం ద్వారా ప్రయోజనం పొందవచ్చు. కెఫీన్ ఎలర్జీ ఉన్నవారు, రక్తం గడ్డం కట్టకుండా మందులు వాడుతున్నవారు గ్రీన్ టీ తాగకూడదు.
• కురులపై కాలుష్య ప్రభావం పడకుండా ప్రొటీన్ కాపాడుతుంది. కాబట్టి ప్రొటీన్ నిండిన ఆహారం తీసుకోవడం మంచిది. దీనికోసం సోయా, పచ్చి బఠాణీ, గుడ్లు, చేపలు, రొయ్యలు, మాంసం తినాల్సి ఉంటుంది. అలాగని ప్రొటీన్ ఎక్కువగా తింటే.. వెంట్రుకలు బిరుసుగా మారి తెగిపోయే అవకాశం ఉంది. కిడ్నీ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పరిమితిగా ప్రొటీన్ నిండిన ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది.
Add new comment